కీర్తనలు 2


అనేక కీర్తనల వలె, రెండవ కీర్తన యొక్క అంశం చివరి వచనంలో ఉద్ఘాటించారు. మనము దేవుడిని ధిక్కరించి నశించిపోవచ్చు, లేదా ఆయనకు లోబడి ఆశీర్వదింపబడవచ్చు. ఈ కీర్తన యొక్క రచయిత పేరు రాయబడలేదు, కాని అపొస్తలుల కార్యములు 4:25-26 స్పష్టంగా దావీదునకు ఆపాదిస్తుంది

A. అన్యజనుల అల్లరి మరియు దేవుని నవ్వు.

1. (1-3) అన్యజనుల తిరుగుబాటు

అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

a. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు: కీర్తనాకారుడు యథార్థముగా తెలియకుండా ఉన్నాడు. అన్యజనులు దేవునికి విరోధముగా అల్లరి రేపడానికి కారణమే లేదు, దాని వల్ల వారికి ఉపయోగమే లేదు. దేవుని పైన వారికి ఉన్న విరోధము వ్యర్ధమైనది.

b. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు: బాబెలు కాలము నుండి, మనుష్యులు దేవునికి విరోధముగా తమ్మును కట్టుకుంటున్నారు. ఒక్కరు దేవునికి విరోధముగా ఉండడం కంటే ఇద్దరు అంతకంటే ఎక్కువ మనుష్యులు దేవుని విరోధముగా ఏకమైతే వారికి మంచి అవకాశం ఉంటుంది వారి తప్పుడు నమ్మకం

c. యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా: వారు యెహోవాను ఆయన అభిషిక్తుని వ్యతిరేకిస్తున్నారు. అభిషిక్తుడు అనగా క్రీస్తు, అభిషేకము పొందినవాడు. యేసు ప్రభువు తండ్రికి పరిపూర్ణ ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి (), తండ్రియైన దేవుడిని వ్యతిరేకిస్తే, యేసు ప్రభువును వ్యతిరేకించడమే. ఒకవేళ మీరు యేసు ప్రభువుకు విరోధముగా ఉంటే, తండ్రియైన దేవునికి విరోధముగా ఉన్నట్లే.

d. మనము వారి కట్లు తెంపుదము రండి: యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా ఉన్నవారు దేవుడు దాస్యమనే కట్లు కడతాడని అనుకుంటారు. వారి ఆత్మీయ వెర్రితనానికి రుజువు ఇదే, ఎందుకంటే దేవుడు దాస్యమనే కట్లు తెంపేవాడే గాని, కట్టేవాడు కాదు.

  • “దిక్కుమాలిన మెడకి క్రీస్తు కాడి భరించలేనటువంటిది, అయితే రక్షింపబడిన పాపికి అది సులువైనది మరియు తేలికైనది… మనము కాడిని ప్రేమిస్తున్నామా లేదా వదిలించుకోవాలనుకుంటున్నామా అని మనకి మనమే తీర్పు తీర్చుకోవచ్చు?” (స్పర్జియన్)

2. (4-6) పరలోకము నుండి ప్రభువు యొక్క నవ్వు.

ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను

a. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు: మనుష్యుడు దేవునికి విరోధముగా ఆలోచించే విధమును చూసి ఆయన నవ్వుచున్నాడు. మనుష్యుని వ్యతిరేకతను చూసి దేవుడు భయపడట్లేడు, తికమకపడట్లేడు, నిరుత్సాహపడట్లేడు. దేవుడు నవ్వుచున్నాడు.

  • దేవుడు ఆకాశమందు ఆసీనుడై యున్నాడు కాబట్టి ఆయన నవ్వుచున్నాడు. ఒక మహిమాన్వితమైన సింహాసనం పైన ఆయన గొప్ప రాజుగా కూర్చొనియున్నాడు. తరువాత ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఆకాశమందున్న సింహాసన గదిలో ఆయన అటు ఇటు తిరగట్లేడు. దేవుడు పూర్ణ శాంతితో మరియు భరోసాతో ఆసీనుడైయున్నాడు.
  • దేవుడు ఆకాశమందు ఆసీనుడై యున్నాడు కాబట్టి ఆయన నవ్వుచున్నాడు. ఆయన కూర్చున్నది భూలోక సింహాసనం కాదు. అది సర్వ సృష్టిపైన అధికారమున్న పరలోక సింహాసనం. భూలోకానికి భయపడాల్సింది పరలోకానికి ఏముంటుంది?
  • “దేవుడు భయపడడు. ఆ విశాలమైన పరలోక ప్రాకారము వెనుక దాగుకొని శత్రువులను లెక్కిస్తూ, తన రాజ్యానికి ఉన్న కొత్త సవాలును అడ్డుకోవడాననికి కావాల్సిన బలమును లెక్కిస్తూ ఉండడు.తాను కూర్చున్న చోటు నుండి కూడా తాను లేవడు. ఈ గొప్ప అమాయకులను చూసి కేవలం నవ్వుతాడు.” (బాయ్సి)
  • “నీతిని ప్రేమించే వారిని దేవుని అపహాస్యమైన నవ్వు ఆదరిస్తుంది. అది పరిశుద్ధుని నవ్వు; అది బలమైన ప్రేమ యొక్క నవ్వు. పాపము చేసే మనుష్యుల శ్రమలను బట్టి దేవుడు సంతోషించడు. తన చిత్తమును నెరవేర్చడానికి అడ్డుపడే అలాంటి వారి గర్వాతిశయములను మరి హింసలను అపహసించడు.” (మోర్గన్)

b. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు: శతాబ్దాల నుంచి, దేవుడిని యేసు క్రీస్తులో ఆయన రాజ్యమును వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారిలో ప్రతి ఒక్కరు విసిగిపోయి నలుగగొట్టబడతారు.

  • క్రైస్తవ్య వ్యతిరేకి అనేందుకు ఉదాహరణ రోమా చక్రవర్తి అయిన డయోక్లీషియన్ (క్రీస్తు శకం 284 నుండి 305 వరకు రాజ్యమేలాడు). ఆయన క్రైస్తవులకు ఎంత బద్ద శత్రువు అంటే, కనికరం లేకుండా సంఘాన్ని హింసించి క్రైస్తవ్యాన్ని ఓడించానని కల్పించాడు. “క్రైస్తవ్యం అనే పేరు తుడిచివేయబడింది” అని ఒక పతకం పైన చెక్కించదానికి ఆదేశించాడు.
  • డయోక్లీషియన్ తన సామ్రాజ్య సరిహద్దులో రెండు స్మారక చిహ్నాల పైన, కింది అక్షరాలను చెక్కించాడు:

    రోమా సామ్రాజ్యాన్ని తూర్పు మరియు పడమరలో విస్తరింపజేసిన మరియు ప్రభుత్వమును నాశనము చేయడానికి వచ్చిన క్రైస్తవుల పేరును తుడిచివేసిన డయోక్లీషియన్ జోవియాన్ మాక్సిమియాన్ హెర్కులెస్ సీసరెస్ ఆగస్టి

    క్రీస్తు అనే మూఢనమ్మకాన్ని ప్రతి చోట నిర్మూలించిన, దేవుళ్ళ పూజను విస్తరింపజేసిన డయోక్లీషియన్ జోవియాన్ మాక్సిమియాన్ హెర్కులెస్ సీసరెస్ ఆగస్టి
  • డయోక్లీషియన్ మరణించి చరిత్ర పుటల్లో చివరలో ఎక్కడో ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క కీర్తి మహిమ లోకమంతా వ్యాపించింది. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు.

c. ఆయన ఉగ్రుడై వారితో పలుకును: దేవుడు ఆకాశమందు నవ్వుచున్నాడు, కాని తాను ఊరికే కూర్చోలేదు. ఆయన నవ్వుచున్నాడు కాని ఆయన కేవలం నవ్వట్లేదు. ధిక్కరించే మనుష్యజాతికి వ్యతిరేకముగా పని చేసే ముందు, ఆయన ముందుగా తిరుగుబాటై చేసిన మానవులతో మాట్లాడుతున్నాడు.

  • ఇది దేవుని గొప్ప కనికరమును చూపిస్తుంది. ధిక్కరించే మనుష్యులకు వ్యతిరేకముగా పని చెయ్యడానికి ఆయనకు ఒక్క క్షణము చాలు. అయితే దాని కంటే ముందు ప్రేమ కరుణతో వారిని హెచ్చరిస్తున్నాడు.

d. నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను: దేవుడు ఒక రాజును స్థిరపరిచాడని, అది తిరుగుబాటు చేసిన మానవజాతి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ కీర్తనలో ఉన్న తిరుగుబాటు చేసిన వారు రాజులు మరియు పాలకులు, అయితే వారి కంటే ఒక గొప్ప రాజు ఉన్నాడని వారు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజు స్థిరపరచబడ్డాడు, ఆయన యెరూషలేములో (సీయోనులో) స్థిరపరచబడ్డాడు.

B. దేశములకు దేవుని కట్టడము

1. (7-9) కుమారుని కట్టడము

కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు

a. కట్టడను నేను వివరించెదను: ఈ క్రింది వాక్య భాగంలో యెహోవా అభిషిక్తుడే ఈ మాటలు చెప్తున్నాడు. తండ్రియైన దేవుడు తనకు సెలవిచ్చిన కట్టడను ఆయన వివరించును.

b. నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను: యెహోవా అభిషిక్తుడు, తండ్రియైన దేవుడు తనతో మాట్లాడిన మాటలను అనగా తాను తండ్రి కనిన కుమారునిగా జ్ఞాపకము చేసుకుంటున్నాడు.

  • యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని మరియు దేవదూతలపైన ఆయనకున్న ఆధిక్యతను హెబ్రీయులకు రాసిన పత్రికలో రచయిత వివరించాడు (హెబ్రీయులకు 1:5). దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో ప్రస్తావించాడు. అదే కుమారుడు అనే నామము. సాధారణంగా దేవదూతలు దేవుని కుమారులుగా కొన్ని సార్లు పిలువబడినప్పటికీ (యోబు 1:6), తండ్రి ఏ దేవదూతను “నీవు నా కుమారుడవు” అని చెప్పలేదు. అది కేవలం త్రిత్వంలోని రెండవ వ్యక్తి అయిన కుమారుడైన దేవునికే ప్రత్యేకించబడింది.
  • కనిన అనేది కూడా ప్రాముఖ్యమైన విషయం, సృష్టించబడిన అనే పదానికి విరుద్ధంగా. యేసు ప్రభువు సృష్టించబడలేదు; సృష్టింపబడిన ప్రతీది ఆయనే సృష్టించాడు (కొలొస్సయులకు 1:16-17). కనిన అనేది ఒకే స్వభావంగల ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది, అయితే మనకంటే వేరే స్వభావం గల వారిని మనము సృష్టిస్తాము. ఒక మనిషి శిల్పాన్ని తయారుచేస్తాడు అయితే ఒక శిశువును కంటాడు.

c. జనములను నీకు స్వాస్థ్యముగాను… ఇచ్చెదను: యెహోవా అభిషిక్తుడు జనములను స్వాస్థ్యముగా ఉంచుకొనియున్నాడు. సమస్త జనములను ఆయన పరిపాలించును మరియు తీర్పు తీర్చుటకు సర్వాధికారము ఆయనకు కలదు (యోహాను 5:22-23).

  • ఈ స్వాస్థ్యము యొక్క ఉత్తేజమైన పరిపూర్ణతను ప్రకటన 11:15 వివరిస్తుంది: ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

d. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు: జనములు మట్టి కుండ వలె ఉన్నారు, ఇనుపదండముతో వాటిని పగులగొట్టుటకు వాటి పైన యెహోవా అభిషిక్తునికి అధికారము కలదు. యెహోవాను, ఆయన అభిషిక్తుని ధిక్కారంచడం ఎంత వెఱ్ఱితనమో ఇది చూపిస్తుంది. ఆ ధిక్కరించే వ్యతిరేకతకు ఎలాంటి కారణము లేదు దానివల్ల వారికి ఎలాంటి ఉపయోగము లేదు.

2. (10-12) కుమారుని గూర్చి జనములకు కట్టడము.

కాబట్టి రాజులారా, వివేకులైయుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

a. రాజులారా, వివేకులైయుండుడి: యెహోవా అభిషిక్తుని నుండి హెచ్చరిక మాటల తరువాత, కీర్తనాకారుడు భూరాజులకు దేవుని పైన వారి అర్ధం లేని ధిక్కరణను వదులుకొమ్మని సలహా ఇస్తున్నాడు.

b. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి: కీర్తనాకారుడు భూరాజులను దేవునికి లొంగిపోయి ఆయనకు చెందవలసిన గౌరవాన్ని ఇవ్వమని చెప్తున్నాడు. అలా సమర్పించి లొంగిపోయిన స్థితిలో వారు తగిన విధముగా వణకుచు సంతోషించవచ్చు.

c. కుమారుని ముద్దుపెట్టుకొనుడి: ప్రధానంగా సమర్పణతో కూడిన ముద్దు, అనగా ప్రత్యేక హోదాలో ఉన్నవారు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారినుంచి పొందుకునే వినయపూర్వకమైన ముద్దు. ఆయనతో మనం సంబంధం కలిగియుండాలని దేవుడు కోరుకునే ప్రేమను సూచిస్తుంది. ఆయన ముందు మన స్థలమేదో మనం గుర్తించాలని, అయితే తనతో సంబంధం కలిగి ఆయనయందు సంతోషించాలని దేవుడు కోరుతున్నాడు.

  • “ముద్దు పెట్టుకోవడం అనేది తన ఆధీనంలోకి తీసుకోవడానికి లేదా స్నేహానికి గుర్తుగా ఉంది.” (క్లార్క్)
  • ఒకవేళ రాజులు మరియు భూపతులు తమ్మును తాము యెహోవా అభిషిక్తుని ముందు ఆయన పూర్ణ ఆధిక్యతను గుర్తించుకొని తగ్గించుకొమ్మని ఆజ్ఞాపించబడితే, మన పరిస్థితి ఏంటి? రాజులు మరియు భూపతులతో మాట్లాడినప్పుడు మానవజాతి మొత్తం అందులో భాగమే.

d. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు: దేవుడిని ధిక్కరించే వారు విరిగిపోయినటువంటివారు, అయితే దేవుని పైన ఆధారపడేవారు ధన్యులు. ప్రతి ఒక్కరు ఏ గుంపుకి చెందినవారో ఎంపిక చేసుకునేందుకు కీర్తనాకారుడు వారికే వదిలేస్తున్నాడు: పగిలిపోయినటువంటి వాడవా? లేదా ధన్యుడవా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *